శర్వానంద్’కు గాయాలు
టాలీవుడ్ హీరోలకు వరుసగా గాయాలు అవుతుండటం కలవరపెడుతోంది. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లో స్టార్ హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు గాయపడిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ని మూడు వారాలపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కు గాయాలయ్యాయి. యువ హీరోలు నాగ శౌర్య, సందీప్ కిషన్ ఒక్కరోజు తేడాతో గాయపడ్డారు. షూటింగ్ చేస్తున్న సమయంలోనే గాయపడి.. ఇంటికి తిరిగొచ్చారు. తాజాగా, మరో యువ హీరో శర్వానంద్ గాయపడ్డారు
తమిళ్ హిట్ ’96’ తెలుగు రిమేక్ లో శర్వానంద్-సమంత జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లో భాగంగా శర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. శిక్షకుల పర్యవేక్షణలో శర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు జాగ్రత్తగా ల్యాండ్ అయ్యారు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాలి ఎక్కువగా రావడంతో ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాళ్లపై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. అదుపు తప్పి భుజాలపై ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనికి గాయాలయ్యాయి. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.