‘బిగ్ బాస్3’కి సెన్సార్ కోరుతూ.. కోర్టులో పిటిషన్ !
బిగ్‌బాస్ తమిళ్ సీజన్-3 ప్రసారానికి స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హోస్ట్ గా బిగ్ బాస్ తమిళ్ సీజన్1, 2 ప్రసారమయ్యాయి. సీజన్ 3కి కూడా కమల్ నే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
విజయ్ టీవీ ఛానెల్లో ఈ నెల 23 నుంచి బిగ్‌బాస్-3 కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి, దానిని ప్రసారం చేసే టీవీ ఛానెల్‌పై మద్రాసు హైకోర్టులో న్యాయవాది సుదన్ బుధవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు.
బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొనే పోటీదారులు అశ్లీలంగా దుస్తులు ధరిస్తున్నారు. ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నారు. ఇది యువతని చెడగొడుతోంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు ముందుగా సెన్సార్ బోర్డు తనిఖీ చేయాలని కోరారు. సెన్సార్ సర్టిఫికెట్ పొందాకే బిగ్ బాస్-3ని ప్రసారం చేయాలని సుదన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలోనూ బిగ్ బాస్ పై చాలా ఫిర్యాదులొచ్చాయ్. ఐతే, సెన్సార్ చేయాలనే డిమాండ్ కొత్తగా తెరపైకి వచ్చింది. మరీ.. దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.
ఇక, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 త్వరలోనే ప్రారంభం కానుంది. హోస్ట్ గా కింగ్ నాగార్జున ఎంపికయ్యారు. ఆయన ఎంపికని బిగ్ బాస్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కంటెస్టర్స్ గా పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. రేణు దేశాయ్, బండ్ల గణేష్, యాంకర్ శ్రీముఖీ, హీరో వేణు.. తదితర పేర్లు వినిపించాయి. వీరిలో ఎవరు బిగ్ బాస్ ఇంట్లో కనిపించబోతున్నారు అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.