రివ్యూ : ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ

చిత్రం : ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ (2019)

నటీనటులు : నవీన్‌ పొలిశెట్టి, శృతి శర్మ, దర్బా అప్పాజి అంభరీష, విశ్వనాథ్‌ తదితరులు

సంగీతం : మార్క్‌ కే రాబిన్‌

దర్శకత్వం : స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే

నిర్మాత : రాహుల్‌ యాదవ్‌ నక్క

రిలీజ్ డేటు : 21జూన్, 2019.

రేటింగ్ : 2.75/5

డిటెక్టివ్ కథ అనగానే మనకు ‘చంటబ్బాయి’ గుర్తొస్తాడు. ‘చంటబ్బాయి’ తరహా డిటెక్టివ్ కథతో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’. నవీన్‌ పొలిశెట్టిని హీరోగా పరిచయం చేస్తూ.. స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయ్. వినోదాన్ని పంచుతూనే, ఉత్కంఠిని కలిగించాయి. దాంతో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రేక్షకుల అంచనాలని అందుకొన్నాడా ? అన్నది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

ఏజెంట్‌ సాయి శ్రీనివాస్ ఆత్రేయ (నవీన్‌ పొలిశెట్టి) నెల్లూరులో ఎఫ్‌బీఐ (ఫాతిమా బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) పేరుతో ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీ నడుపుతుంటాడు. పెద్ద కేసుని డీల్ చేసి పెద్ద పేరు తెచ్చుకోవాలన్నది ఆత్రేయ ఆశ. ఐతే, పెద్ద కేసులు లేకపోవడంతో.. పోలీసులకు చిన్న చిన్న కేసుల్లో సాయం చేస్తుంటాడు. స్నేహితుడు, క్రైమ్‌ రిపోర్టర్‌ శిరీష్‌ ద్వారా భారీగా దొరుకుతున్న అనాథ శవాల గురించి వింటాడు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్‌ చేసే క్రమంలో.. ఆ కేసులోనే అనుమానితుడిగా అరెస్ట్ అవుతాడు. జైలు లో ఉండగా.. తన కూతురిని ఘోరంగా మానభంగం చేసిన హత్య చేశారని ఓ వ్యక్తి ఆత్రేయకు చెబుతాడు.

తన కూతురు చనిపోయే ముందు ఫోన్ చేసిన ముగ్గురి ఫోన్ నెంబర్లని ఇస్తాడు. బెయిల్ నుంచి బయటికొచ్చాక.. ఆ ముగ్గురి ఫోన్ నెంబర్లని కనుగొనే పనిలో పడతాడు. ఇద్దరి నెంబర్లని సంపాదించి.. వారిని ఫాలో అవుతాడు కూడా. ఇంతలో ఆ ఇద్దరు హత్య చేయబడతారు. ఆ కేసు కూడా ఆత్రేయపైనే పడుతోంది. మరోసారి జైలుకి వెళ్తాడు. ఈసారి కేవలం 5రోజుల బెయిల్ పై బయటికొచ్చి.. కేసుని ఇన్విస్టిగేషన్ చేస్తాడు. ఇంతకీ.. అసలు నిందితులు ఎవరు ? వారిని ఆత్రేయ పట్టుకొన్నాడా ? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్

* కథ

* నవీన్ నటన

* నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్

* స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే డిటెక్టివ్ కథని బాగా రాసుకొన్నాడు. దాన్ని తెరపై గ్రిప్పింగ్ గా చూపించాడు. ఐతే, ఓ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో ఉండాల్సిన వేగం మాత్రం లోపించింది. చాలా సన్నివేశాలు సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకులను విసిగిస్తాయి. ఆత్రేయ పాత్రలో నవీన్ ఒదిగిపోయాడు. ఆయన కామెడీ టైమింగ్‌ బాగుంది. సీరియస్‌ ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌లోనూ బాగా నటించాడు. హీరోయిన్ శృతి శర్మకు నటించే స్కోప్ పెద్దగా దక్కలేదు. ఐతే, ఉన్నంతలో ఆకట్టుకొంది. మిగితా నటీనటులు తమ తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా :

డిటెక్టివ్ కథలకి నేపథ్య సంగీతం ప్రాణంలాంటిది. మార్క్‌ కే రాబిన్‌ నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగులేదు. చాలా సన్నివేశాలు స్లోగా సాగాయి. అవి ప్రేక్షకుడిని విసిగించేశాయ్. కొన్ని సన్నివేశాలకి కత్తెరపెడితే.. సినిమా ఇంకాస్త స్వీడందుకొనే ఛాన్స్ ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : డిటెక్టివ్ తరహా సినిమాలు ఇష్టపడే వారికి ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ బాగా నచ్చుతుంది. మిగితా ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అంశాలు కూడా సినిమాలో ఉన్నాయి.

రేటింగ్ : 2.75/5