‘సైరా’ రిలీజ్ డేటు ఫిక్స్


మెగాస్టార్ చిరంజీవి151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల విషయంలో పలు అనుమానాలు తెరపైకి వచ్చాయ్. వేసవిలో రావాల్సిన చిత్రం వెనక్కి వెళ్లింది. ఈ యేదాది రావడం కష్టమేనన్నారు. కానీ, అక్టోబర్2న సైరా ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయమైపోయింది.

సోమవారంతో సైరా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫర్ రత్నవేలు ట్విటర్‌ ద్వారా తెలిపారు. నిర్మాణానంతర కార్యక్రమాల్లో భాగంగా డీఐ పనులు మొదలైనట్టు రత్నవేలు తెలిపారు. 2017 చివరన సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం సుదీర్ఘకాలం చిత్రీకరణ జరుపుకొంది. షూటింగ్ కు అడ్డంకులు, నటీనటులకి గాయాలు, అగ్ని ప్రమాదాల మధ్య సైరా షూటింగ్ పూర్తయింది.

బ్రిటిష్‌ పాలనపై పోరాటం సాగించిన తొలితరం స్వాత్రంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నయనతార, తమన్నా నాయికలు. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌తో పాటు అనుష్క కీలక పాత్రలు పోషించారు. యుద్ధ నేపథ్యం, పోరాట ఘట్టాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.