రాహుల్ కోసం వీహెచ్ రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామాల బాట పట్టారు. మూకుమ్మడిగా తమ తమ పదవులకి రాజీనామా చేస్తున్నారు. రాహుల్ గాంధీ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరుతూ టీ-కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎఐసిసి కార్యదర్శి పదవికి సీనియర్ నేత వి. హనుమంతరావు రాజీనామా చేశారు.

వీహెచ్ తన రాజీనామా లేఖని సోనియా గాంధీకి, రాహుల్‌ గాంధీకి పంపించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ ఒక్కరే బాధ్యత వహించకూడదని, సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలకూ ఓటమికి బాధ్యత వహించాల్సి ఉంటుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు.

మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్టులో రేవంత్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమట్ రెడ్ది రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీలో చేరేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆయన దారిలోనే చాలామంది కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నట్టు రాజకీవర్గాల సమాచారమ్. అదే జరిగితే.. తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడం ఖాయమని చెప్పవచ్చు.