చంద్రబాబు ఓదార్పు యాత్ర !
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు ఓదార్పు యాత్రకు ప్లాన్ చేసినట్టు కనబడుతోంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 23స్థానాలకి పరితమైంది. మంత్రులు, హేమాహేమీలు ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో తెదేపా కళ తప్పింది. ఆ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు.
ఇప్పటికే నలుగురు తెదేపా ఎంపీలు, పలువురు కీలక నేతలు కాషాయం కండువా కప్పుకొన్నారు. మరోవైపు, అధికార పార్టీ వైకాపా నేతల నుంచి స్థానికంగా తెదేపా నేతలపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నేతలని కాపాడుకోవడం, వారికి భరోసా ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 13 జిల్లాల్లో 13 బృందాలని ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందాలు క్షేత్రస్థాయి పర్యటించి.. తెదేపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలపై స్పందించనుంది.
దాడులు జరిగిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనుంది. సోమవారం గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే… స్వయంగా చంద్రబాబు కాకుండా పార్టీ నేతలతో ఓదార్పు యాత్రకి ప్లాన్ చేసినట్టు కనబడుతోంది. అదికూడా వైకాపా నేతల దాడులు జరిగిన తెదేపా కుటుంబాలకి మాత్రమే. దీనివలన తెదేపాకి ఒరిగేది ఏంటీ ? మనవెనక పార్టీ ఉన్నది అన్న ధీమాని ఇవ్వడమే అంటున్నారు.