బంగ్లాతో మ్యాచ్ టీమిండియాలో రెండు మార్పులు
ప్రపంచకప్ లో సెమీస్‌కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ ను ఢీకొట్టనుంది. సంచలన విజయాలకి బంగ్లా కెరాఫ్ అడ్రస్. మెగా టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లను మట్టికరిపించింది. సెమీస్ రేసులో ఇంకా నేనున్నాంటూ పోరాడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిస్తే 13 పాయింట్లతో కోహ్లీసేన నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఇది ఓడితే శ్రీలంకతో చివరి మ్యాచ్ కోసం ఎదురు చూడాలి.
ఆదివారం భారత్, ఇంగ్లాండ్ ఆడిన పిచ్ మీదే మంగళవారం మ్యాచ్ జరుగనుంది. ఇది బ్యాటింగ్ వికెట్. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు సాధించొచ్చు. ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో రెండు మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. జాదవ్, చాహల్‌లను బంగ్లాతో మ్యాచ్‌కు పక్కన పెట్టనున్నట్లు సమాచారం. వీరి స్థానంలో జడేజా, భువనేశ్వర్‌లకు చోటు దక్కనున్నట్లు జట్టు వర్గాలు చెబుతున్నాయి. బంగ్లా ఆటగాళ్లు స్పిన్ ఎదుర్కోగలరు. ఈ నేపథ్యంలో ఓ స్పినర్ ని తగ్గించి పేసర్ ని ఎంచుకొనే ఛాన్స్ ఉంది.