ఎందుకు కట్టాలి టోల్ శిస్తు.. ?
జీవితాంతం టోల్ శిస్తు కట్టాల్సిందేనని స్పష్టం చేశారు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. మంగళవారం లోక్‌సభలో టోల్ రుసుముపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమధానం ఇచ్చారు. ప్రజలకు మంచి రహదారులు కావాలంటే వాళ్లు టోల్ రుసుము కట్టాల్సిందే. ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేనందున టోల్ వ్యవస్థ కొనసాగుతుంది. టోల్ అనేది జీవితాంతం ఉంటుంది. కొద్దిగా పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.
సామర్థ్యం ఉన్న ప్రాంతాల నుంచి టోల్ తీసుకుని.. గ్రామాలు, కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఆ నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఇక, స్కూలు బస్సులు, రాష్ట్ర రవాణా సంస్థల బస్సులకు టోల్ మినహాయింపు ఇవ్వడంపై పరిశీలిస్తామని తెలిపారు. అంతేకాదు.. ప్రతిరాష్ట్రంలో ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు.