అనిశా కస్టడీలోకి లావణ్య
ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్య అరెస్టయిన సంగతి తెలిసిందే. చంచల్గూడ మహిళా జైలులో ఉన్న ఆమెను న్యాయస్థానం అనుమతితో ఇవాళ అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆమెను ప్రశ్నించనున్నారు. అనిశా అధికారుల సోదా సమయంలో ఆమె ఇంట్లో భారీ ఎత్తున లభ్యమైన నగదు, బంగారు ఆభరణాల గురించి వివరాలు తెలుసుకోనున్నారు.
ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో లావణ్య ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిన సంగతి తెలిసిందే. మరోసారి సోదాలు జరపగా ఆమె సోదరుడి బ్యాంకు ఖాతాల్లో 20లక్షల నగదు, ఆమె బంధువు ఖాతాలో 8లక్షల నగదును గుర్తించారు. ఈ నగదు అంతా లావణ్య అక్రమార్జనగా అధికారులు భావిస్తున్నారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు?ఇతర ఆస్తులు ఎక్కడెక్కడ దాచి ఉంచారనే అంశాలపై లావణ్యను అనిశా అధికారులు ప్రశ్నించనున్నారు.