‘ఎర్ర సంచీ’ అసలు సీక్రెట్ ఇదే.. !

కేంద్ర బడ్జెట్‌ ప్రతులను ఎర్ర సంచీలో తీసుకురావడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. భారతీయ సంస్కృతిని చాటి చెప్పేందుకు ఎర్ర సంచీని వాడారనే కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఎర్ర సంచీ అసలు సీక్రెట్ విప్పారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘సూట్‌ కేసుల మార్పిడి’కి వ్యతిరేకం అనడానికి అదో సంకేతమన్నారు.

ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్మలా తొలిసారి చెన్నైకి వచ్చారు. నాగరాథర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో సూట్‌కేసులు తీసుకు రావాల్సిన అవసరం లేదు. అదే ఎర్రసంచీ తీసుకురావడం వెనక ఉద్దేశం. పారదర్శకతకు పెద్దపీట వేసేందుకే ఈ ప్రభుత్వం తేలికైన టెండర్ల విధానం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. సంపన్నులు చెల్లించే ఆదాయ పన్నుపై సుంకం విధించాం. మీరు వ్యాపారం చేయొద్దని అనడం లేదు. కాస్త ఎక్కువ పన్ను కట్టాలని అడుగుతున్నామన్నారు.