రాహుల్ ప‌ట్టాభిషేకానికి షెడ్యూల్ ఖరారు…

అనుకున్న‌దే జ‌ర‌గ‌బోతుంది..దేశ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకునేంద‌కు స్పీడు పెంచిన రాహుల్ గాంధీ డిసెంబ‌రులో ప‌ట్టాభిష‌క్తుడు కానున్నాడు. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌న‌దైన శైలిలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేస్తూ ఎన్నిక‌ల్లో పోటీ ని పెంచి తానేంటో ఇప్ప‌టికే నిరూపించుకున్నాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ డైరెక్ష‌న్ లో వ‌చ్చె ఎన్నిక‌ల్లో అధికారం చేప‌ట్టేందుకు పావులు క‌దుపుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఎన్నిక‌ల్లోగా రాహుల్ గాంధీకి బాధ్య‌త‌లు అప్పగించాల‌ని సోనియా భావించారు. అయితే ఇంకొంత కాలం త‌రువాత ఆ నిర్ణ‌యం అమ‌లు చేస్తార‌ని అంతా భావించారు. కానీ డిసెంబ‌రులోనే ఈ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి షెడ్యూల్ ఖ‌రారు చేశారు. డిసెంబ‌రు1న నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. డిసెంబ‌రు 4 వ‌ర‌కు నామినేషన్ ధాఖలు చివరి తేదీగా, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 11 వ‌ర‌కు గ‌డువు ఇచ్చారు. అధ్య‌క్ష ఎన్నిక‌ను డిసెంబ‌రు 16న నిర్వ‌హించి 19న ఫ‌లితాలు వెల్ల‌డించ‌నున్నారు.

కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు రాహుల్ కే అప్ప‌గిస్తార‌ని ముందు నుంచి ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు షెడ్యూల్ కూడా ప్ర‌క‌టించ‌డంతో లాంఛ‌నంగా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డ‌మే మిగిలింది. మొత్తంగా డిసెంబరులో ఈ ప్ర‌క్రియ మొత్తం పూర్తవుతుంది.