4గురు తెదేపా ఎమ్మెల్యేలు సస్పెండ్‌


ఏపీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు, నిమ్మల కిష్టప్ప, బుచ్చయ్య చౌదరి సస్పెన్షన్ కు గురయ్యారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగనుంది. ఇక, గురువారం మరో నలుగురు తెదేపా సభ్యులని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు.

నదీ జలాల పంపకంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా తెదేపా ఎమ్మెల్యేలు సభకు ఆటంకం కలిగించారు. దీంతో నలుగురు తెదేపా సభ్యులు బెందాళం అశోక్‌, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదించారు. వారిని స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.