ఉద్యోగాల‌పై మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌

తెలంగాణ‌ల ఉద్యోగాల భ‌ర్తీ పై మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య చేశారు. జీహెచ్ఎంసీలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు ఆయ‌న హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాలు ప‌ర్య‌టించి సంద‌ర్శించారు.
ముషీరాబాద్, నారాయణగూడ, బ‌న్సీలాల్ పేట‌తో పాటు చిక్క‌డప‌ల్లి లోని సిటీ సెంట్రల్ లైబ్రరీని సంద‌ర్శించారు.

లైబ్రరీలో సౌకర్యాలు, అభివృద్ధికోసం తక్షణం అయిదుకోట్ల రూపాయలను విడుదల చేస్తామంటూ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. కెరీర్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ ప్ర‌కారం ల‌క్షా ప‌న్నెండు వేల ఉద్యోగాలు ఖ‌చ్చితంగా భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చ‌క్ర‌పాణితో మరోసారి లైబ్రరీ విద్యార్థులతో సమావేశమయ్యేందుకు వస్తానని తెలిపిన మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉద్యోగ నియామ‌కాల్లో ఆల‌స్యం జ‌రుగుతున్న మాట వాస్త‌వ‌మేన‌ని తాను ఈ విష‌యాన్ని అంగీక‌రిస్తున్నాన‌ని, అయితే కొన్ని కార‌ణాల‌వ‌ల్ల ఉద్యోగాల భ‌ర్తీ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని, ఖ‌చ్చితంగా హామీ ప్ర‌కారం ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పారు.