జైపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. జైపాల్ రెడ్డి పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అభిమాన నేతని కడసారి చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
పార్టీలకి అతీతంగా రాజకీయ నేతలు జైపాల్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఎంపీ కేశవరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్ ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ రమేశ్ కుమార్, జేసీ దివాకర్ రెడ్డి, డీకే అరుణ, చిన్నా రెడ్డి, డి. శ్రీనివాస్, ఎంపీ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఎమ్మెల్యే హరీష్‌రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులు అంత్యక్రియలో పాల్గొన్నారు.
ఇవాళ రాజ్యసభలో జైపాల్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మరణవార్తను చదువుతూ వెంకయ్యనాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. తన భావోద్వేగాలను నిలువరించుకోలేకపోయా. జైపాల్ రెడ్డితో తనకు 40 యేళ్ల అనుబంధం ఉంది. ఆయన తనకంటే ఆరేళ్లు సీనియర్. శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఇద్దరం ఒకే బెంచిపై కూర్చునే వారమని, ఆంగ్లం, తెలుగు భాషల్లో మంచి పట్టు ఉన్న జైపాల్ రెడ్డి ఉర్దూ కూడా అద్భుతంగా మాట్లాడేవారు. దేశం ఒక గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందని వెంకయ్య అన్నారు.