చార్మినార్’కు మరో అరుదైన గుర్తింపు
హైదరాబాద్’లోని సుప్రసిద్ధ చార్మినార్ కు మరో అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యం లో ఐకానిక్ ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రాంతాలలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం ద్వారా దేశంలోనే స్వచ్ఛ మోడల్ గా రూపొందించాలని భావిస్తున్నారు. దేశం మొత్తంలో పది ప్రాంతాలను ఐకానిక్ గా గుర్తించారు.
ఈ పది ఐకాన్ లలో చార్మినార్ ను ఒకటిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని వంద ప్రముఖ ఐకాన్ నగరాలను స్వచ్ఛతకు మోడల్ గా తీర్చి దిద్దడానికి స్వచ్ఛ భారత్ మిషన్ సంకల్పించింది. దీనిలో భాగంగా మొదటి దశలో అమృతసర్’ను, రెండవ దశలో చార్మినార్ తో సహా మొత్తం పది నగరాలను ఐకానిక్ ప్రాంతాలుగా స్వచ్ఛ్ భరత్ మిషన్ ప్రకటించింది. దీనిలో భాగంగా ఒక్కో ఐకానిక్ ప్లేస్ ను స్వచ్ఛత పరంగా సమగ్ర అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తారు.
ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఆయా ఐకానిక్ ప్లేస్ లో చేపట్టాల్సిన స్వచ్ఛ కార్యక్రమాలపై స్థానిక పాలనా యంత్రంగం తో చర్చించి ప్రణాళిక బద్దంగా పనులు చెప్పట్టడానికి కావాల్సిన నిధులను అందజేస్తారు. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ ను స్వచ్ఛ్ ఐకాన్ గా రూపొందించడానికి NTPCకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై చార్మినార్’తో పాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, చర్యలపై న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని స్వచ్ఛభారత్ మిషన్ ఏర్పాటు చేసింది.
ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమీషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. చార్మినార్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకై ఈ సమావేశంలో చర్చించారు. దేశంలోనే చార్మినార్ ను స్వచ్ఛతకు మారుపేరు గా రూపొందించడానికి కావాల్సిన ఆర్థిక, సాంకేతిక సహకారం అందించడం, కాల పరిమితి తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరిపారు.