జమ్ముకశ్మీర్‌ పరిస్థితిపై కిషన్ రెడ్డి స్పందన


జమ్ముకశ్మీర్‌ లో కేంద్ర బలగాల మోహరింపుపై పలు అనుమానాలకి దారి తీస్తున్న సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్‌ విషయంలో కేంద్రం ఏదైనా కీలక నిర్ణయం తీసుకొందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జమ్ముకశ్మీర్ తాజా పరిస్థితిపై ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదు. అమర్‌నాథ్‌ యాత్రకు ముప్పు ఉందన్న ఐబీ సూచన మేరకే జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లో తెలుగుప్రజల సహా మరెవరి భద్రతకు ఢోకా లేదు. శనివారం రాత్రి జమ్ము నుంచి 20 మంది ఎన్‌ఐటీ తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారని చెప్పారు. వారంతా ఇవాళ మధ్యాహ్నానికే దిల్లీ చేరుకుంటారన్నారు. మిగిలిన 90 మంది ఇవాళ ఉదయం ప్రత్యేక రైలులో దిల్లీ బయలు దేరుతారని తెలిపారు. జమ్ము నుంచి విద్యార్థులు, పర్యాటకులు స్వస్థలాలకు వెళ్లేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశామని, కేంద్ర హోం శాఖ, స్థానిక ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తోందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.