హైదరాబాద్’పై కశ్మీర్ ఎఫెక్ట్
చాలా పకడ్భందీగా ‘ఆపరేషన్ కశ్మీర్’ని అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేసింది. దాంతో పాటు జమ్ముకశ్మీర్ ని విభజించింది. జమ్ము-కశ్మీర్, లద్దాక్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. వీటిల్లో జమ్ము-కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాగా.. లద్దాఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొంది కేంద్రం.
స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రాల్లోని పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించారు. ఈ సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులను పూర్తిగా నిషేధించినట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదనపు బలగాలను మొహరించేందుకు సిద్దమని డీజీపీ తెలిపారు.