రివ్యూ : మన్మథుడు 2


చిత్రం : మన్మథుడు 2 (20019)

నటీనటులు : నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు

సంగీతం : చైతన్‌ భరద్వాజ

దర్శకత్వం : రాహుల్‌ రవీంద్రన్‌

నిర్మాతలు : నాగార్జున, పి. కిరణ్‌

‘మన్మథుడు’గా ప్రేక్షకులని మురిపించాడు నాగార్జున. 2002లో విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘మన్మథుడు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగ్స్ బుల్లెట్స్ లా పేలాయి. ఇప్పటికీ ఆ పంచ్ ల పవర్ ని ప్రేక్షకులు మరచిపోలేదు. కడుపుబుబ్బ నవ్వించేసిన మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ని రెడీ చేశారు.

ఇది ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్‌ సినిమాకి రిమేక్. ఇందులోనూ మన్మథుడు పాయింట్ ఉంది. తను ప్రేమించిన అమ్మాయి దూరం కావటంతో ప్రేమంటేనే అబద్ధమని కేవలం తన ఆనందం కోసం మాత్రమే బతకాలని నిర్ణయించుకొన్న కథానాయకుడి ప్రేమకథ ఇది. ఇది నాగ్ ని ఆకర్షించింది. వెంటనే రిమేక్ రైట్స్ ని తీసుకొని.. యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చేతిలో పెట్టాడు. దానికి మన్మథుడు 2 టైటిల్ పెట్టడంతో.. అంచనాలు పెరిగిపోయాయి.

పోస్టర్, టీజర్, ట్రైలర్ లోనూ మన్మథుడు పోలికలు కనిపించాయి. కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని అనిపించింది. మరీ.. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన రెండో మన్మథుడు.. మన్మథుడు స్థాయిలోనే ఉన్నాడా.. ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

సాంబశివరావు అలియాస్ సామ్ (నాగార్జున) ప్లే బాయ్. పోర్చుగీసులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందినవాడు. తను ప్రేమించిన అమ్మాయి దూరం కావటంతో ప్రేమంటేనే అబద్ధమని కేవలం తన ఆనందం కోసం మాత్రమే బతకాలని నిర్ణయించుకుంటాడు. జీవితాన్ని శృంగారమయం చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు.

మరోవైపు, సామ్ కు పెళ్లి కావడంలేదని ఆయన తల్లి (లక్ష్మీ), అక్కా చెల్లల్లు (లక్ష్మీ, ఝాన్సీ, దేవ దర్శిని) బెంగపెట్టుకొంటారు. మూడ్నేళ్లలోపు సామ్ కి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. పెళ్లి ప్రయత్నాల్లో ఉంటారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అవంతిక (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) అనే అమ్మాయిని తన ప్రియురాలిగా కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తాడు సామ్. సరిగ్గా పెళ్లి రోజున చెప్పకుండా వెళ్లిపోవాలని అవంతికతో అగ్రిమెంట్‌ చేసుకుంటాడు. సామ్ కుటుంబానికి బాగా దగ్గరైన అవంతిక ఏం చేసింది ? ప్లేబాయ్‌ లైఫ్‌ ని ఎంజాయ్‌ చేస్తున్న సామ్‌ మారాడా ? అన్నది రెండో మన్మథుడు కథ.

ప్లస్ పాయింట్స్ :

* రకుల్ నటన

* వెన్నెల కిషోర్ కామెడీ

* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

* ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు

* మాటలు, పాటలు

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

కథ-కథనం అద్భుతంగా కుదిరిన సినిమా మన్మథుడు. వినోదం, సంభాషణలు, సంగీతం, భాగోద్వేగాలు తగిన పాళ్లలో పండిన మన్మథుడు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాడు. ఇలాంటి సినిమాకి సీక్వెల్ గా భావించిన మన్మథుడు 2పై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. వాటిని అందుకొనేందుకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రయత్నించాడు. అందుకో కొద్దిమేర సక్సెస్ అయ్యాడు కూడా. కథ-కథనం పక్కనపెడితే కథని వినోదాత్మకంగా నడపటంలో సక్సెస్ అయ్యాడు. వెన్నెల కిషోర్ పాత్రతో ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టాడు. రెండో మన్మథుడుని పర్వాలేదనిపించాడు.

ఇక, నాగార్జున నటనకి వంకపెట్టలేం. ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మన్మథుడే. రెండో మన్మథుడుగా యంగ్ లుక్ లో కనిపించాడు. రొమాన్స్ లోనూ తనదైన మార్క్ చూపించాడు. స్వతంత్ర భావాలున్న యువతి పాత్ర అవంతిక గా రకుల్ ప్రీత్ సింగ్ అద్భతంగా నటించింది. సినిమాను రెండో భాగంలో తన భుజాలపై మోసిందని చెప్పవచ్చు.

వెన్నెల కిషోర్ సినిమాకు ప్రధాన బలం. ఎప్పుడూ హీరో వెంట కనబడే పాత్రలో కనిపించాడు. సినిమా పడుతుంది అన్నప్పుడల్లా తన కామెడీతో నిలబెట్టాడు. నాగ్ ప్రేయసిగా కీర్తి సురేష్, అవసరం లేని అతిథి పాత్రలో సమంత మెరిసింది. ఇక సీనియర్ నటి లక్ష్మీ, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు సినిమాకు ఆకర్షణ అని చెప్పవచ్చు.

సాంకేతికంగా :

సినిమాటోగ్రాఫర్ సుకుమార్ పోర్చుగల్ అందాలని చక్కగా చూపించారు. ప్రతీ ఫ్రేమ్ రిచ్ లుక్‌తో చూపించారు.
చైతన్ భరద్వాజ్ అందించిన పాటల్లో ఒకట్రెండు తెరపై చూడ్దానికి బాగున్నాయి. నేపథ్యం సంగీతం బాగుంది. ఎక్కడా సాగదీత కనిపించలేదు. ఎడిటింగ్ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. ఐతే, మన్మథుడు రేంజ్ లో పంచ్ లు పేలలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

చివరగా :

‘మన్మథుడు’ తరహా కలం బలం కనిపించలేదు. గ్రిప్పింగా స్క్రీన్ ప్లే లేదు. కానీ, వినోదం పంచడంలో రెండో మన్మథుడు… మన్మథుడు స్థాయిలో ఉన్నాడు.

రేటింగ్ : 3/5