పాకిస్థానీ మహిళ నోరుమూయించిన ప్రియాంక !

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా నోటికొచ్చినట్లు మాట్లాడిన ఓ పాకిస్థానీ మహిళకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. శనివారం లాస్‌ఏంజెల్స్‌లో బ్యూటీకాన్‌ పేరిట ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా అతిథిగా విచ్చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ పాకిస్థానీ యువతి ప్రియాంకతో దురుసుగా ప్రవర్తించారు.

“భారత బలగాలు పాకిస్థాన్‌లో ఎయిర్‌ స్ట్రయిక్స్‌ చేసినప్పుడు మీరు ‘జై హింద్‌’ అని ట్వీట్‌ చేశారు. యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌ అయివుండి అలా రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేయొచ్చా?ఓ పాకిస్థానీ మహిళగా నేను, నా దేశవాసులు మీరు చేసే మంచి పనులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాం. అలాంటిది మీరు పాక్‌పై యుద్ధానికి దారితీసేలా వ్యాఖ్యలు చేయడం సబబేనా?” అంటూ అరుస్తూ ప్రశ్నించింది.

దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. “నాకు పాకిస్థాన్‌లో ఎందరో స్నేహితులు ఉన్నారు. కానీ నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు బాధ్యత, గౌరవం ఉన్నాయి. నేను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నీ దేశం కోసం ఈ విధంగా నన్ను ప్రశ్నిస్తున్నావ్‌. నేను కూడా అంతే. ఇలా అరవకు. అరిచి నీ పరువు తీసుకోకు” అంటూ సమాధానం ఇచ్చింది. ప్రియాంక సమాధానంపై కార్యక్రమానికి హాజరైన వారు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.