ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మంత్రి కేటీఆర్..
తెలంగాణలో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ మేరకు చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మంత్రులు కెటి రామారావు, లక్ష్మారెడ్డిలు ఈరోజు టియస్ పియస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణితో సచివాలయంలో సమావేశం అయ్యారు. నిన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్దులతో మాట్లాడిన సందర్భంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపిన మంత్రి కేటీఆర్ వెంటనే ఆ దిశగా చర్యలు చేపడుతుండటం విశేషం. టియస్ పియస్సీ ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియ వివరాలు మంత్రికేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటిదాకా సుమారు 29500 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసినట్లు చైర్మన్ ఘంటా చక్రపాణి ఆయనకు తెలిపారు.
టియస్ పియస్సీ ఇప్పటి వరకు దాదాపు 75 నోటిఫికేషన్లు విడుదల చేసిందని, ఇందులో 23400 ఉద్యోగాలకు పరీక్షలు పూర్తిచేసినట్లు మంత్రికి తెలిపారు. దీంతోపాటు సుమారు 18 పరీక్షలకు సంబంధించి డాటా ప్రాసెసింగ్ ప్రస్తుతం సిజిజి వద్ద కొనసాగుతున్నట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ఆయన మంత్రులకు చెప్పారు.
సర్వీస్ కమీషన్తోపాటు పోలీస్, విద్యుత్ శాఖ మొదలయిన శాఖల ద్వారా లక్ష ఉద్యోగాల భర్తీ అవుతాయని మంత్రి కెటి రామారావు తెలిపారు. టియస్ పియస్సీ పారదర్శకంగా పనిచేస్తుందన్న మంత్రి, కమీషన్ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్, డాటా ప్రాసెసింగ్ వంటి ప్రక్రియలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవసరం అయిన ఐటి సెంటర్ ఏర్పాటు కోసం భవన సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. ఈ మేరకు తమ శాఖ పరిధిలో ఉన్న పలు భవనాలను మంత్రి అదేశాల మేరకు అధికారులు కమీషన్ చైర్మన్ కు చూపించారు.