ఏపీ రాజధాని మారనుందా ?
వైకాపా అధికారంలోకి వస్తే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారని తెదేపా ప్రచారం చేసింది. ఐతే, తెదేపా ప్రచారాన్ని ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాని ఘనంగా గెలిపించారు. ఏకంగా 151స్థానాలని కట్టబెట్టారు. ఐతే, ఎన్నికల సమయంలో తెదేపా వెలుబుచ్చిన అనుమానాలు ఇప్పుడు నిజంకాబోతున్నట్టు అర్థమవుతోంది. త్వరలోనే అమరావతిపై వైకాపా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనుంది. ఈ విషయం మంత్రి బొత్స తాజా మాటలని బట్టి స్పష్టమవుతోంది.
మంగళవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. త్వరలోనే దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు బొత్స. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతోంది. ప్రజాధనం దుర్వినియోగమవుతోందన్నారు.
ఇటీవల సంభవించిన వరదలతో అక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయని తెలిసిందని, దీని నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, డ్యామ్లు నిర్మించాల్సి ఉంటుందని.. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడనుందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజధానిగా అమరావతి అనుకూలంగా కాదని బొత్స మాటల్లో వినిపించింది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి మార్చే యోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది.