భాజాపాకు విజయశాంతి సపోర్ట్


తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి త్వరలో భాజాపా తీర్థం పుచ్చుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై రాములమ్మ ఇప్పటి వరకు స్పందించలేదు. అదే సమయంలో తెరాసపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేసిన ఆరోపణలకి పరోక్షంగా మద్దతు తెలపడం విశేషం. హైదరాబాద్ పర్యటనకి వచ్చిన జేపీ నడ్డా.. కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగా తిప్పికొట్టారు.

అదే సమయంలో దమ్ముంటే సీఎం కేసీఆర్ అవినీతి చేసినట్టు ఆధారాలు చూపాలని సవాల్ విసిరాడు. దానికి బీజేపీ నేతల నుంచి సమాధానం లేదు. కానీ, విజయశాంతి లైన్ లోకి వచ్చింది. గతంలో ఇంటర్ బోర్డ్ వ్యవహారంలో తెరాస నేతలకు సంబంధాలపై ఆధారాలు సేకరించారం. రాష్ట్రపతికి అందించాం. దీంతో ఈ మొత్తం ఉదంతంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాష్ట్రపతి లేఖ రాశారు. దీంతో కేటీఆర్ షాక్ కి గురయ్యారు. అదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపించారు.

ఇప్పుడేమో.. సీఎం కేసీఆర్ అవినీతిని నిరూపించాలని సవాల్ విరుసుతున్నాడు. ఇందుకోసం మీ నాన్న కేసీఆర్ అనుమతి తీసుకొన్నారా.. ? అని విజయశాంతి ప్రశ్నించారు. అదే సమయంలో బీజేపీ నేతలు కేసీఆర్ అవినీతిపై ఆధారాలు సేకరిస్తే సంతోషిస్తామని అన్నారు రాములమ్మ. ఈ మొత్తం ఏపీసోడ్ లో విజయశాంతి కేటీఆర్ కి కౌంటర్ ఇవ్వడం కన్నా.. బీజేపీని సపోర్ట్ చేసేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనబడుతోంది. ఈనేపథ్యంలో ఆమె త్వరలోనే కమలం గూటికి చేరనుందని ఫిక్సైపోవచ్చేమో..!