వీఆర్వోలు, సర్వేయర్ల వ్యవస్థ రద్దు
తెలంగాణలో గాంధీ జయంతి నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొత్త చట్టం విప్లవాత్మకమైందని, వ్యవస్థలోని లొసుగులన్నింటినీ తొలగించి, ప్రజలందరికీ కష్టాలు తీర్చేలా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. అంతేకాదు వీఆర్వోలు, సర్వేయర్ల వ్యవస్థ రద్దు, రెవెన్యూ ఉద్యోగులు, అధికారులను వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల్లో విలీనం చేస్తామని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది.
పాలనలో కలెక్టర్ల పాత్రని ఉద్దేశించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా యంత్రాంగం క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత మీదే. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు మీరు సంధానకర్తలుగా ఉన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తేవాలి. సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలి. ప్రజాప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించాలి. పాలనలో ప్రతి అంశం కీలకమైందేనన్నారు.
తెలంగాణ అయిదేళ్ల పాలన పూర్తి చేసుకొంది. మా పాలన సంతృప్తికరంగా సాగింది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ప్రజలకు పాలనాపరమైన ఇబ్బందులేమీ ఎదురుగాకుండా చూడాలి. వారు తరచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రావద్దు. ఒకసారి వెళ్తే అన్నీ పరిష్కారం కావాల్సిందేనన్నారు సీఎం కేసీఆర్.