నవంబర్ 30న తెలుగులో తొలి సంగీత కచేరి

తెలుగులో తొలి సంగీత కచేరికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 30న ‘వాయిస్ ఆఫ్ లెజెండ్స్’ పేరుతో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ పాటల పండగకి హైదరాబాదులోని ‘గచ్చిబౌలి’ స్టేడియం వేదిక కానుంది. తెలుగు పాటను తేనెలో ముంచిన గాయకుడు బాలు. ఏసుదాస్ స్వరానికి ఆకాశమే హద్దు. మనసులను మంత్రించే స్వర పరిమళం చిత్ర సొంతం. ఈ ముగ్గురు కలిసి ఒకే వేదికపై పాటల పండుగ చేయనున్నారు. బాలు తనయుడు చరణ్ ఆధ్వర్యంలో ఈ సంగీత కచేరి జరగనుంది.

తొలి తెలుగు సంగీత కచేరి గురించి బాలు మాట్లాడుతూ.. “గతంలో వేరే కంట్రీస్ లో సంగీత కచేరీలు చేశాం. తెలుగులో జరుగుతోన్న తొలి సంగీత కచేరి ఇది. ఈ కచేరీలో కేవలం తెలుగు పాటలను మాత్రమే పాడనున్నాం. కర్ణాటక, తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రొఫెషనల్ మ్యుజిషియన్స్ ఈ లైవ్ షోకు మ్యూజిక్ బ్యాండ్ గా వ్యవహరించనున్నారు. వ్యాపార ధోరిణిలో చేస్తోన్న ఒక అందమైన సాంస్కృతిక కార్యక్రమం ఇది” అన్నారు.