ఏపీ రాజధాని ‘దొనకొండ’కు మారనుందా ?
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించాలనే ప్లాన్ లో జగన్ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ హింట్ ఇచ్చారు. రాజధాని మార్పుపై ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. రాజధానిగా అమరావతి సురక్షితం కాదని బొత్స అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఐతే, రాజధాని అమరావతి నుంచి దొనకొండకు మారనుందని.. దీనిపై కేంద్రంలోని పెద్దల నుంచి తనకు సమాచారముందని అంటున్నారు మాజీ ఎంపీ చింతా మోహన్. ఆయన బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడినట్లు తెలిసింది. దొనకొండ విషయంలో తొందరపడొద్దు. అక్కడ జలవనరులు, రైల్వే, రవాణా సౌకర్యాలు లేవు. తిరుపతి కాకుండా రాజధానిగా ఇంకా ఏ ప్రాంతమైనా నిలబడదన్నారు చింతా మోహన్. తిరుపతిని రాజధాని చేయాలని 2013లోనే తాను నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖరాసినట్లు చింతా మోహన్ గుర్తు చేశారు. చింతా మాటలతో ఏపీ రాజధాని మార్పుపై తథ్యమని స్పష్టం అవుతుంది. ప్రస్తుతం సీఎం జగన్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగొచ్చాక రాజధాని మార్పుపై మరింత స్పష్టత రానుంది.