బ్రేకింగ్ : చిదంబరం అరెస్ట్

హైడ్రామా మధ్య కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చిదంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం నిరాకరించింది. ఈ నేపథ్యంలో చిదంబరం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు నిరాశ తప్పలేదు.

ఇక నిన్నటి నుంచి అజ్ఝాతంలో ఉన్న చిదంబరం సడెన్ గా బుధవారం రాత్రి కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రత్యక్షమై మీడియాతో మాట్లాడారు. తాను ఏ నేరమూ చేయలేదని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనంత మాత్రాన నేరస్థుడిగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పారు. మీడియా సమావేశం అనంతరం జోర్‌బాగ్‌లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. సీబీఐ, ఈడీ అధికారులు కూడా అక్కడికి చేరుకోగా.. హైడ్రామా చోటు చేసుకుంది. చిదంబరం వ్యక్తిగత సిబ్బంది సీబీఐ అధికారులని అడ్డుకున్నారు. దీంతో సీబీఐ అధికారులు గోడదూకి లోపలికి ప్రవేశించారు. చిదంబరాన్ని అరెస్ట్ చేసి కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు.