రేవంత్ మౌనం వెన‌క వ్యూహం అదేన‌ట‌..

తెలంగాణ‌లో కేసీఆర్ ను ఢీ అంటే ఢీ అంటూ ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచిన వ్య‌క్తి రేవంత్ రెడ్డి. టీటీడీపీలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ లో చేరిన విష‌యం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌డంలేదు కూడా. దీంతో కాంగ్రెస్ స‌ముద్రంలో రేవంత్ ఓ నీటి చుక్క అంటూ అధికార పార్టీ చేసిన కామెంట్స్ నిజ‌మ‌వుతున్నాయంటూ చ‌ర్చ జ‌రుగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. టీటీడీపీలో వ్య‌వ‌హ‌రించిన‌ట్లుగా ఇక్క‌డ కూడా అలా చేస్తే త‌న‌కు బ్రేకులు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. లోతు తెలుసుకుని నీళ్ల‌లోకి దిగిన‌ట్లుగా కాంగ్రెస్ లో అంతా తెలుసుకున్నాకే రంగంలోకి దిగాల‌నుకుంటున్నార‌ట‌.

ఇప్ప‌టికే ఇంట‌ర్న‌ల్ గా కాంగ్రెస్ నేత‌ల‌ను క‌లుస్తూ ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా జాగ్రత్త‌లు తీసుకుంటున్నార‌ట‌. ఒక వైపు ప్ర‌భుత్వం త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తుండ‌టంతో అన్నీ గ‌మ‌నిస్తూ తాను చేసేది చేస్తూ త‌న బ‌లం త‌గ్గ‌కుండా చూసుకుంటున్నార‌ట‌.
ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలను ఆధారాల‌తో స‌హా సేక‌రించి డిసెంబ‌రు 9 నుంచి ఫీల్డులోకి రావాల‌నుకుంటున్నార‌ట‌. అప్పుడే క్రియాశీల రాజ‌కీయాలు ప్రారంభించాల‌నుకుంటున్నానంటూ స‌న్నిహితుల వ‌ద్ద చెబుతున్నార‌ట‌. చూడాలి మ‌రి డిసెంబ‌రులో మొద‌ల‌య్యే ఆట వేట‌గా మారుతుందో లేదో..