భాజపా కేంద్ర కార్యాలయానికి జైట్లీ పార్థీవదేహం
అనారోగ్యంతో కన్నుమూసిన భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్ ఘాట్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. కొద్దిసేపటి క్రితమే అరుణ్‌జైట్లీ పార్థీవ దేహాన్ని కైలాష్ నగర్‌లోని ఆయన నివాసం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 1.30 వరకు ఆయన భౌతికకాయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు.అనంతరం అంతిమ యాత్రగా బయల్దేరనున్నారు.
జైట్లీ భౌతికకాయానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. దేశం అరుణ్ జైట్లీ లాంటి గొప్ప సంస్కరణ కర్తను కోల్పోయిందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో జైట్లీ ఏపీకి సానుకూలంగా స్పందించారని చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.