మీరు నిర్ణయం తీసుకోకపోతే.. మాదారి మాదే..
టీడీపీ సీనియర్ నేత ఎలిమినేటి ఉమామాధవరెడ్డికి పెద్ద చిక్కొచ్చిపడిందట. తన రాజకీయ భవిష్యత్ పై ఎటూ తేల్చుకోలేకపోతున్న ఆమెకు కార్యకర్తల వ్యవహారం మరింత ఆలోచనలో పడేలా చేస్తోందట.. నిన్న మొన్నటి వరకు ఉమామాధవ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరిగినా , అటు వైపు నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో కాస్త వెనక్కి తగ్గారని చెప్పుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం భువనగిరి నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారట.
నియోజకవర్గంలోని భువనగిరి, పోచంపల్లి, వలిగొండ , బీబీనగర్ మండలాలకు చెందిన పార్టీ ముఖ్యులతో సుదీర్ఘంగా చర్చిచారట. చాలామంది అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడానికే మొగ్గు చూపారట. మరికొందరు మాత్రం పార్టీలోనే కొనసాగితే ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమైతే టికెట్ ఖరారయ్యే అవకాశం ఉంటుందని కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారట. అయితే ఇందులో మెజారిటీ మెంబర్స్ టీఆర్ఎస్ లో చేరడానికే ప్రాధాన్యతనిచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. డిసెంబర్ లోగా నిర్ణయాన్ని ప్రకటించాలని, లేకపోతే తమంతట తామే ఇతర పార్టీలలోకి వెళతామని తేల్చి చెప్పారట.
జిల్లాలో తన మార్కు పాలిటిక్స్ ఉండాలంటే టీఆర్ఎస్ లోకి చేరడమే సమంజసమని ఆమె భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో సీఎం మాట్లాడారని , వారి అభిప్రాయాలు కూడా తెలుíకున్నారని, సీఎం హామీ మేరకు ఆమె త్వరలోనే టీఆర్ఎస్ లో చేరడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు స్థానిక నేతలు.