మున్సిపాలిటీల్లో కేటీఆర్ టార్గెట్ వారే !
గత యేడాది చివరల్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయాన్ని సాధించింది. వంద స్థానాలు గెలుపే లక్ష్యంగా పెట్టుకొన్న తెరాస 88స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత నేతల చేరికతో తెరాస బలం వందకు చేరింది. ఇక, పార్లమెంట్ ఎన్నికల్లో కారు సారు పదహారు స్లోగన్ తో బరిలోకి దిగింది. ఐతే, లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 9 ఎంపీ స్థానాలని మాత్రమే కారు ఖాతాలో పడ్డాయ్.
ఈ నేపథ్యంలో త్వరలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది గులాభి పార్టీ. మున్సిపాలిటీల పరిధిలో ఇతర పార్టీల్లో బలమైన నేతలు ఎవరున్నారు. వారి సత్తా ఎంత అనే విషయాలను ఫోకస్ పెట్టింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ భవన్‌లో తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కేటీఆర్ ఆరాతీశారు. వారిని తెరాసలో చేర్చేకొనే ప్రయత్నాలు చేయనున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మున్సిపాలిటీల్లో తెరాస ఆపరేషన్ ఆకర్ష్ అన్నమాట.
మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెరాస విజయం ఏకపక్షమేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీలు ఎంత హడావిడి చేసినా పట్టించుకోవద్దని.. ప్రజలు తెరాస వైపే ఉన్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలోనూ తెరాస ముందస్తుకు వెళ్లనున్నట్టు సమాచారమ్.