రాజధాని మార్పు.. అన్నీ అపోహలే !
ఏపీ రాజధాని మార్పు అంశంలో జరుగుతున్నవన్నీ అపోహలే అన్నారు స్పీకర్ తమ్మినేని సీతారామ్. బుధవారం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో పార్లమెంట్లో స్పీకర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తమ్మినేని హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని మార్పుపై స్పందించారు.
రాజధాని మారుస్తామని ఎవరు చెప్పారు ? సీఎం చెప్పారా? అని ప్రశ్నించారు. శివరామకృష్ణ కమిటీ నివేదికనే మంత్రి బొత్స ఉటంకించారు తప్ప అది ప్రభుత్వ అభిప్రాయం కాదు. రాజధాని మార్పు అంశంలో జరుగుతున్నవన్నీ అపోహలేనని తమ్మినేని అన్నారు. రాజధాని రైతులనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను కూడా సీఎం సంతృప్తి పరుస్తారని తమ్మినేని చెప్పారు.
ఇక, సదస్సుల్లో దేశవ్యాప్తంగా ఉన్న స్పీకర్ వ్యవస్థపై చర్చ జరిగిందని తమ్మినేని చెప్పారు. ఏపీలో గత ప్రభుత్వంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని.. వారిలో నలుగురితో మంత్రులుగా ప్రమాణం చేయించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇటీవల నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలో విలీనం చేసుకోవడం దారుణమన్నారు.