చరణ్ విషయంలో తప్పుడు ప్రచారం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి దర్శకుడు కొరటాల శివకు హ్యాండిచ్చాడని జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా సెట్టయ్యింది. ఘనంగా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఐతే సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయ్యింది. అందుకు గల కారణాలు మాత్రం చెప్పని చరణ్.. కొరటాలతో కచ్చితంగా సినిమా ఉంటుందని ప్రకటించారు.

ప్రస్తుతం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రంగస్థలం 1985’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాల్సి ఉంది. ఐతే.. చరణ్ మరోసారి కొరటాలకు హ్యాండిచ్చాడు. తన తదుపరి సినిమాని ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడని చెప్పుకొంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సూచన మేరకు చరణ్ బోయపాటి సినిమాని ఓకే చేసిన మాట నిజమే. కానీ, కొరటాల శివ సినిమా స్థానంలో బోయపాటి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు అనే వార్తలు ఏమాత్రం నిజం లేదట. ఈ ప్రచారంపై స్వయంగా చరణ్ స్పందించినట్టు తెలుస్తోంది. అసలు నిజం తెలియనివారు రామ్ చరణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా.. ఈ ప్రచారానికి తెరపడుతుందేమో చూడాలి.