మళ్లీ.. స్మిత్ నెం.1 అయ్యాడు


ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెం.1 ర్యాంకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య దోబూచులాడుతోంది. 2015 నుంచి 2018 వరకు స్మిత్ నెంబర్ వన్ గా కొనసాగాడు. ఐతే, బాల్ టాంపరింగ్ కారణంగా యేడాది పాటు నిషేధాని గురికావడంతో కోహ్లీ నెం.1గా అవతరించాడు. ఐతే, స్మిత్ పునరాగమనం తర్వాత ఆడిన యాషెస్ లో సిరీస్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే. యాషెస్ తొలి టెస్టులోనే రెండు సెంచరీలు బాదాడు. ఆసీస్ ని ఒంటి చేత్తో గెలిపించాడు. తిరిగి టెస్టు ర్యాంకింగ్స్ లో నెం.1 స్థానాన్ని చేజిక్కించుకొన్నాడు. రెండో టెస్టులోనూ స్మిత్ రాణించాడు.

ఇక గాయం కారణంగా స్మిత్ మూడో టెస్ట్ ఆడలేదు. తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో స్మిత్ 904 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలిచాడు. కోహ్లీ 903 పాయింట్లతో రెండో స్థానంలో, విలియమ్ సన్ 878 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు వన్డేల్లో నంబర్ వన్ బౌలర్ గా ఉన్న బుమ్రా.. టెస్టుల్లోనూ అగ్రస్థానం దిశగా సాగుతున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో కమిన్స్ (905), రబాడ (851) మొదటి రెండు స్థానాల్లో, బుమ్రా 835 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నాడు.