కేంద్రంపై కేటీఆర్ ధ్వజం
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అందించడం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అయిదేళ్ల పాలనలో ఒక్క అంశంలోనూ సహకారం అందించలేదని విమర్శించారు. బుధవారం తెలంగాణభవన్ లో కేటీఆర్ కంటోన్మెంటు బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే సాయన్నతో సమావేశం నిర్వహించారు. కంటోన్మెంటు సమస్యలు, రాబోయే ఎన్నికల గురించి చర్చించారు.
కేంద్రం నుంచి ఎలాంటి ఆసరా లేదు. ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించలేదు. విభజన హామీలను సరిగా అమలు చేయలేదు. జిల్లాలు, జంటనగరాల ప్రజల మేలు కోసం స్కైవేల నిర్మాణం చేపట్టాం. వీటికి రక్షణ శాఖ స్థలాలు అవసరం. వీటి కోసం మూడేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నాం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అభ్యర్థించినా కనీస స్పందన లేదు.
క్షేత్రస్థాయిలో తెరాస చాలా బలంగా ఉంది. కంటోన్మెంటు బోర్డు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది. మన గెలుపు కేంద్రానికి కనువిప్పు కావాలని కేటీఆర్ అన్నారు. ఇక హుజూర్ నగర్ శాసనసభ స్థానంలో ఉప ఎన్నికపై తెరాస దృష్టి సారించింది. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇతర నేతలతో కేటీఆర్ బుధవారం చర్చించారు.