యాదాద్రి స్థంబాలపై కేసీఆర్ బొమ్మ
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆలయంలో నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆలయ గోడలు, రాతి స్తంభాలపై తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలకు సంబంధించిన అంశాలను అద్భుతంగా చెక్కుతున్నారు. ఐతే కొన్ని స్థంబాలపై సీఎం కేసీఆర్, కేసీఆర్ సర్కార్ సంక్షేమ పథకాలని చెక్కుతుండటం హాట్ టాపిక్ గా మారింది. ఎవరి చరిత్ర వారే రాసుకుంటే అది చరిత్ర కాదని.. ఎవరి శిల్పం వారే చెక్కుకుంటే అది శిల్పం కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు వాటిని సమర్థిస్తున్నవారు ఉన్నారు.
తెలంగాణ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దే. ఆయన బొమ్మ యాదాద్రి స్థంబాలపై ఉంటే తప్పేంటీ ? అదే విధంగా సమస్యల తెలంగాణని బంగారు తెలంగాణగా తీర్చుదిద్దుతున్న సంక్షేమపథకాలు, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్ సంక్షేమపథకాలని యాదాద్రి ఆలయ స్థంబాలపై చెక్కితే తప్పేంటీ ? అని తెరాస శ్రేణులు, కేసీఆర్ అభిమానులు వాదిస్తున్నారు. మొత్తానికి.. యాదాద్రి స్థంభాలపై కేసీఆర్ బొమ్మ, ఆయన తీసుకొచ్చిన పథకాల వ్యవహారం రాజకీయ వేడిని రగిలిస్తోంది. దీనిపై సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.