ఆ శిల్పాలను పూర్తిగా తొలగించాల్సిందే : రాజాసింగ్


యాదాద్రి ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్ బొమ్మ, ఆయన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గుర్తులు, పేర్లని చెక్కడంపై రాజకీయ
దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆగమేఘాలమీద వాటిని తొలగించే పనిలో పడ్డారు. ఇప్పటికే ‘కేసీఆర్ కిట్’ అనే అక్షరాలను, ‘తెలంగాణకు హరితహారం’ అనే పదాలను తొలగించారు.సదరు పథకాల
గుర్తులను మాత్రం అలాగే ఉంచారు. ఐతే, ఆ శిల్పాలని మొత్తం తొలగించాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు.

యాదాద్రి వచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్ ముందుగా లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపై కలియతిరిగారు. వివాదాస్పద శిల్పాలను పరిశీలించారు. వెంటనే వాటిని తొలగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నాయకుల బొమ్మలను చెక్కిన వాళ్లు.. వాళ్ల అవినీతిని కూడా చెక్కుతారా అని రాజాసింగ్ ప్రశ్నించారు. యాదాద్రి ఆలయం ప్రజల సొమ్ముతో కట్టిందని.. ఎవరి సొత్తూ కాదన్నారు. వారంలోగా శిలలపై కేసీఆర్, కారు బొమ్మలు తొలగించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.