బన్నీతో విబేధాలపై విక్రమ్ కామెంట్
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ కి ఓ అవకాశం ఇచ్చారు. ‘నా పేరు సూర్య’ తర్వాత విక్రమ్ తో సినిమా చేయాలని అనుకొన్నారు. విక్రమ్ చెప్పిన కథని ఓకే చేశాడు కూడా. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. ఐతే, విక్రమ్ రెడీ చేసిన ఫైనల్ స్క్రిప్ట్ బన్నీకి నచ్చలేదు. దీంతో తన కోసం మరో స్క్రిప్ట్ ని రెడీ చేయమని విక్రమ్ ని కోరాడు. విక్రమ్ కూడా బన్నీ కోసం కొత్త స్క్రిప్ట్ ని మొదలెట్టాడు. ఆ తర్వాత ఏమైందో తెలీదు. కానీ విక్రమ్-బన్నీ సినిమా క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ‘అల.. వైకుంఠపురంలో’ తెరకెక్కుతోంది. వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
బన్నీతో సినిమా క్యాన్సిల్ అయిన విక్రమ్ నానికి ఓ కథ చెప్పి ఒప్పించారు. అదే నాని గ్యాంగ్ లీడర్. ఈవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ.. “గ్యాంగ్ లీడర్ కన్నా ముందు చాలా ఇష్యూలు ఉన్నాయి. కానీ, నాని ఒక్కటే చెప్పాడు. విక్రమ్ ఏది ఏమైనా సరే.. నీతో ఒక సినిమా చేస్తా అని నా వెన్నంటే నిలబడ్డాడు. నీ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు అద్భుతమైన నటుడివి. అంతకుమించి నాకు నిజమైన స్నేహితుడివి. మనిద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేయాలి” అన్నారు.
గ్యాంగ్ లీడర్ కంటే ముందు చాలా ఇష్యూలు ఉన్నాయని విక్రమ్ అనడం బన్నీ సినిమాని ఉద్దేశించినవే. ఐతే, ఆ ఇష్యూలు ఏంటని డీప్ గా వెళ్లలేదు విక్రమ్. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ హిట్ అయితే.. బన్నీతో సినిమా విషయంలో జరిగిన ఇష్యూలు అన్నింటినీ విక్రమ్ ఈజీగా మరిచిపోవచ్చు. తేడా కొడితే మాత్రం విక్రమ్ కి కొంచెం కష్టమే.