రివ్యూ : గ్యాంగ్ లీడర్
చిత్రం : గ్యాంగ్ లీడర్ (2019)
నటీనటులు : నాని, కార్తికేయ, ప్రియాంకా అరుళ్ మోహన్, లక్ష్మీ, శరణ్య, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
సంగీతం : అనిరుధ్ రవి చంద్రన్
నిర్మాతలు : నవీన్ ఎర్నేని, ఎర్నేని రవి మరియు మోహన్ చెరుకూరి
రిలీజ్ డేటు : 13 సెప్టెంబర్, 2019.
నాని అంటే నమ్మకం. ఆయన సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ. అంతేకాదు.. ఫ్యామిలీతో కలిసి హాయిగా సినిమా చూడొచ్చు. నాని సినిమా ఎప్పుడొస్తుందా ? అని ఎదురుచూడక్కర్లేదు. యేడాదికి నాలుగైదు సినిమాలు. రెండ్నెళ్లకో సినిమా వస్తుంటుంది. ఈ యేడాది ఇప్పటికే ‘జెర్సీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అద్భుత నటనతో ఆకట్టుకొన్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. జెర్సీ తర్వాత నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కె కుమార్ దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలని అందుకొనే అనిపించాయి. మరీ.. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని గ్యాంగ్ లీడర్ ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ!
కథ :
పెన్సిల్ పార్ధ సారథి (నాని) రివేంజ్ రైటర్. అలాగని గొప్ప కథలేమీ రాయడు. హాలీవుడ్ క్రైమ్ సినిమాలను తెలుగులో నవలలుగా రాస్తూంటాడు. అవేవీ క్లిక్ కావు. ఈ క్రమంలో అతని దగ్గరకి ఓ ఐదుగురు ఆడవాళ్లు ఓ వ్యక్తిని చంపాలని.. దానికి సాయం చేయాలని కోరతారు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆ ఆడవాళ్ల గ్యాంగ్ లీడర్ గా నాని మారతాడు. ఆ గ్యాంగ్ మెంబర్స్ లో ఒకరైన ప్రియ (ప్రియాంక మోహన్) తో ప్రేమలో పడతాడు. ఈ గ్యాంగ్ టార్గెట్ ఆలిండియా లో నెంబర్ వన్ రేసర్ దేవ్ (కార్తికేయ)ని చంపడం. ఇంతకీ నాని గ్యాంగ్ దేవ్ ని ఎందుకు చంపాలనుకుంటోంది ? ప్రియతో పార్థసారధి ప్రేమ ఫలించిందా.. ?? ఆడవాళ్ల గ్యాంగ్ కి నాని ఎందుకు సాయం చేశాడు ?? అనేది వినోత్మకంగా సాగే రివేంజ్ డ్రామా.
ప్లస్ పాయింట్స్ :
* నాని, అతని గ్యాంగ్ నటన
* కార్తీకేయల విలనీజం
* ఫస్టాఫ్
* కామెడీ, ఎమోషన్స్
* నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
* సెకాంఢాఫ్ లో స్లో నేరేషన్
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
‘గ్యాంగ్ లీడర్’ కథని వెంకీ అనే యువ రచయిత రాశాడు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వెంకీని ప్రేక్షకులకి పరిచయం చేశాడు నాని. రేపు థియేటర్స్ లో సినిమా చూసి నవ్వుకొంటే.. అది ఇతని రైటింగే అని చెప్పాడు. నాని చెప్పినట్టుగానే థియేటర్స్ లో నవ్వుపు పూశాయి. రివేంజ్ స్టోరీని వినోదాత్మకంగా చూపించడం ఆకట్టుకొంది. ఇక దర్శకుడు విక్రమ్ కె కుమార్ స్క్రీన్ ప్లే గొప్పగా ఉంటుంది. కానీ అది సామాన్య ప్రేక్షకుడికి అర్థంకాదు. గ్యాంగ్ లీడర్ లో మాత్రం అలాంటి గందరగోళం ఏమీ లేదు. చాలా సింపుల్ గా కథని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోయింది.
ఆ ట్విస్ట్ తో సెకాంఢాఫ్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయ్. కానీ సెకాంఢాఫ్ లో సినిమా వేగం తగ్గింది. అలాగని బోర్ కొట్టించలేదు. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకాంఢాఫ్ తేలిపోయిందని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో మాత్రం మళ్లీ మేజిక్ చేశాడు. ఆఖరి 10నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగాయి. సెకాంఢాఫ్ ని ఇంకాస్త షార్ప్ చేసి ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది.
ఇక నాని నటన విషయంలో వంకపెట్టలేం. ఎప్పటిలాగే నేచురల్ నటనతో అదరగొట్టేశాడు. నాని, అతని గ్యాంగ్ తెరపై చేసే హంగామా కడుపుబ్బ నవ్విస్తుంది. ఏడిపిస్తుంది కూడా. ఎమోషన్స్ బాగా పడింది. హీరోయిన్ ప్రియా మోహన్ అందంగా కనిపించింది. నటనతో ఆకట్టుకొంది. నాని గ్యాంగ్ లోని సీనియర్ నటీమణుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారి కామెడీ టైమింగ్ అద్భుతం. విలన్ కార్తీకేయ బాగా నటించాడు. నానితో పోటీ పడి మరీ నటించాడు. ఇకాపై కార్తీకేయ ధైర్యంగా విలన్ వేషాలు వేయొచ్చు. మిగితా నటీనటులు తమ తమ పరిథి మేరకు నటించారు.
సాంకేతికంగా :
ముందుగా అనిరుధ్ సంగీతం గురించి చెప్పుకోవాలి. నేపథ్య సంగీతం అదిరిపోయింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ కి నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరింది. క్యూబా సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్టాఫ్ సినిమాలో సినిమా ఎక్కడా బోర్ కొట్టడు. సరదా సరదాగా సాగిపోతుంటుంది. సెకాంఢాఫ్ లో డ్రాగ్ చేసినట్టు అనిపించింది. కొన్ని సన్నివేశాలకి కత్తెరపెడితే బాగుండేది. మైత్రీ మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : నాని, అతని గ్యాంగ్ సూపర్ గా నవ్వించేస్తుంది
రేటింగ్ : 3/5
నోట్ : ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.