జగన్ 100రోజుల పాలనపై పవన్ ఫైర్ !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇటీవలే 100రోజుల పాలనని పూర్తి చేసుకొంది. తమ పాలన అద్భుతంగా సాగుతుందని, ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని వైకాపా శ్రేణులు చెప్పుకొంటున్నాయి. మరోవైపు, ఇది రాక్షస పాలన అంటూ తెదేపా గగ్గోలు పెడుతోంది. జగన్ రాక్షస పాలనకి తెరలేపారని ఆత్మకూరులో వైకాపా బాధితులని సమాజానికి చూపే ప్రయత్నం చేసింది. ఇక, జగన్
వందరోజులపాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా స్పందించారు. కాస్త లేటైనా జగన్ పాలనపై పవన్ ఘూటుగానే స్పందించారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జగన్ వందరోజుల పాలనపై ఓ నివేదికని విడుదల చేశారు. వైకాపా 100రోజుల పాలనపై 9అంశాలపై 33పేజీల నివేదికని విడుదల చేశారు. వైసీపీ పాలనో పారదర్శక, దార్శనికత లోపించిందన్నారు. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణలో సన్నద్ధత లోపించిందన్నారు.వరద పరిస్థితుల అంచనాలో పాలనా యంత్రాంగం నిస్తేజంగా వ్యవహరించిందన్నారు. టీడీపీని కూల్చింది ఇసుక మాఫియానే.. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో వైసీపీ విఫలమైందన్నారు. ఇసుకే లేకుండా చేశారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు.

100 రోజుల్లో ఇసుక పాలసీనే తీసుకురాలేకపోయారన్నారు.పోలవరం నిర్మాణంలో అవకతవకలుంటే సరి చేయాలని, టెండర్లు రద్దు చేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మంత్రి బొత్స తన ఆస్తులను అమ్మి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా ? అని పవన్ ప్రశ్నించారు. మొత్తంగా జగన్ 100రోజుల పాలనపై పవన్ పెదవి విరిచారు.