తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలని తీసుకెళ్లిన పాక్ 

పాక్ తరచూ కాల్పులు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే భారత్ పైకి జరిపిన దాడిలో ఇద్దరు సైనికులను కోల్పోయింది.  తప్పుని అంగీకరించిన పాక్ జవాన్లు తెల్ల జెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లారు.ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10-11 తేదీల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. ఈ కాల్పుల్లో పాక్ కి చెందిన గులామ్‌ రసూల్‌ అనే జవాన్ చనిపోయాడు.
 
రసూల్ మృత దేహాన్ని తీసుకెళ్లేందుకు భీకర కాల్పులు జరిపేందుకు పాక్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో పాక్ మరో సైనికుడిని కోల్పోయింది. దీంతో గత్యంతరం లేక పాక్ తన తప్పుని ఒప్పుకొంటూ.. తెల్లజెండాలతో వచ్చిన తమ సైనికుల మృతదేహాలని తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

గతంలో పాక్ కు చెందిన బోర్డర్  యాక్షన్ టీం సభ్యులు భారత్ లోకి చొరబడేందుకు యత్నించి దాదాపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వారి శవాలను తీసుకెళ్లేందుకు తెల్లజెండాలతో రావాలని భారత్ కోరినప్పటికీ.. పాక్ స్పందించలేదు. వారు తమ సైనికులు కాదని మొండిగా వాదించింది. ఇప్పుడేమో పాక్ తెల్లజెండాలని తమ సైనికుల మృతదేహాలని తీసుకెళ్లేందుకు రావడం గమనార్హం.