ఏడు పద్దులకి ఆమోదం

తెలంగాణ శాసనసభలో బుధవారం మొత్తం ఏడు పద్దులకు ఆమోదం తెలిపారు. రెవెన్యూ, రవాణా, వ్యవసాయం, హోంశాఖ, పశుసంవర్థక, ఎక్సైజ్, పౌర సరఫరాలశాఖల పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆయా శాఖలపై సమగ్ర చర్చలో భాగంగా
మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలపై విస్తృతంగా అధ్యయనం చేస్తున్నామని, దీనివల్ల రైతులకు లాభాలతోపాటు, ఆహార కల్తీని కూడా నిరోధించవచ్చన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ మెరుగు పరుస్తామన్నారు.
 
రైతు సమన్వయ సమితి చేసే పని ఇప్పుడే మొదలవుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ సమితులు క్రియాశీలకంగా పని చేస్తాయన్నారు. రైతు సమన్వయ సమితికి తొందరలోనే అధ్యక్షుడిని నియమిస్తామని సీఎం తెలిపారు. ఇతర పంటలకంటే పసుపు, మిర్చి పంటల విషయంలోనే సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరిస్తామన్నారు. విజయా పాల ఉత్పత్తులను కొందరు కల్తీ చేస్తున్నారని, వారి ఆగడాలను అరికట్టాలన్నారు. రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ చేస్తామని, వారి కమిషన్ పెంచుతామన్నారు.