గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలొచ్చేశాయ్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 1 నుంచి 8 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష జరిగిన పది రోజుల్లోనే ఫలితాలు విడదుల చేయడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా 1,34,524 పోస్టులకు గానూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో గ్రామ సచివాలయాల్లో 13 విభాగాలకు సంబంధించి 95,088 ఉద్యోగాలు, వార్డు సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించి 33,501 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21.5లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అక్టోబర్ 2న విధుల్లో చేరనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్ గా ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.15వేలు చొప్పున వేతనం చెల్లించనున్నారు.