‘వాల్మీకి’ టైటిల్ ఎందుకు మార్చామంటే ?
హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమా రిలీజ్ కి ముందు రోజు టైటిల్ ని మార్చడం జరిగింది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ‘వాల్మీకి’ టైటిల్ మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. తమ ఆత్మగౌరవం దెబ్బతినేలా వాల్మీకి టైటిల్ ఉందని బోయ, వాల్మీకి సామాజికవర్గాలు ఆందోళన చేశాయి. వాల్మీకి చేతిలో గన్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు, ఇందులో వాల్మీకి గొప్పదనం చూపించాం. ఆయన్ని చెడుగా చూపించలేదని చిత్రబృందం చెబుతూ వచ్చింది.
సెన్సార్ బోర్డ్ కూడా ‘వాల్మీకి’ టైటిల్ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో వాల్మీకి చిత్రబృందం ధైర్యంగా రిలీజ్ కి వెళ్లింది. ఐతే శుక్రవారం సినిమా రిలీజ్ ఉండగా.. గురువారం అనంతరపురం, కర్నూలు జిల్లా కలెక్టర్లు ఆ రెండు జిల్లాల్లో వాల్మీకి సినిమాని బ్యాన్ చేయాలనే ఆదేశాలు ఇచ్చారు. ఈనేపథ్యంలోనే వాల్మీకి టైటిల్ ని ‘గద్దలకొండ గణేష్’గా మార్చామని దర్శకుడు హరీష్ శంకర్ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఐతే, సెన్సార్ బోర్డ్ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత కూడా సినిమా విడుదలని ఆపే అధికారం కలెక్టర్లకి ఉందా ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.