మెట్రో ప్రారంభోత్స‌వంతో ట్రాఫిక్ న‌ర‌కం..?

సాధారణంగానే ట్రాఫిక్ స‌ముద్రంలో ఈదుతూ క‌ష్టాలుప‌డే హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల‌కు ఇవాళ రెట్టింపు క‌ష్టం త‌ప్పేలా లేదు. ఒక ర‌కంగా ట్రాఫిక్ న‌ర‌కాన్ని అనుభ‌వించాల్సిందేనే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. 170 దేశాల నుంచి దాదాపు 1500మంది అతిధులు, పారిశ్రామిక‌వేత్త‌లు హైదరాబాద్ కు విచ్చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు, వీఐపీలు అంద‌రికీ భాగ్య‌న‌గ‌రం సాధ‌ర ఆహ్వానం ప‌లుకుతోంది. ఇవాళ రాత్రి నగరంలోని ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘనమైన విందును ప్రభుత్వం ఏర్పాటు చేయగా, సాయంత్రం 5 గంటల తరువాత వీరిని ఫలక్ నుమా ప్యాలెస్ కు ఎలా తరలించాలన్నది పోలీసుల ముందు అతిపెద్ద సవాల్ గా మారిందట‌.

5 గంటలకు తొలి రోజు జీఈఎస్ సదస్సు ముగియనుండగా, ఆపై అతిథులను ఫలక్ నుమా కు తీసుకువెళ్లేందుకు 45 బస్సులను ఏర్పాటు చేశారు. ముందుగా నరేంద్ర మోదీ కాన్వాయ్, ఆ తరువాత ఇవాంకా కాన్వాయ్, ఆపై కేసీఆర్, కేంద్ర మంత్రుల కాన్వాయ్ లను అనుమతించి, అప్పుడు అతిథులను తీసుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం మాదాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, రాజేంద్రనగర్, ఫలక్ నుమాకు వెళ్లే రహదారిని పూర్తి ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. ఈ మార్గంలో ప్రయాణానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశాలు ఉండటంతో, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు, ఆపై 9 నుంచి 11 గంటల మధ్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేలాలేదు.