గుడ్ న్యూస్ : దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గింపు

దేశ ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నును తగ్గించింది. 34.94శాతం నుంచి 25.17శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ప్రస్తుతం కార్పొరేట్ పన్ను 30శాతం ఉంది. కొత్త నిబంధనల ప్రకారం.. దేశీయ కంపెనీలు ప్రోత్సాహకాలు, రాయితీలు వద్దనుకుంటే కార్పొరేట్ పన్ను ఇకపై 22శాతంగా ఉంటుంది. సర్ ఛార్జ్ లు, సెస్ కలిపి కార్పొరేట్ పన్ను 25.17శాతంగా ఉండనుంది. అంతేగాక.. 22శాతం ఆదాయపుపన్ను శ్లాబులో ఉన్న కంపెనీలు కనీస ప్రత్యామ్నాయ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. తాజా తగ్గింపుతో ప్రభుత్వం ఏటా రూ. 1.45లక్షల కోట్ల మేర ఆదాయం కోల్పోనుంది.

తాజా ఉద్దీపనల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 1780 పాయింట్లు లాభపడి 37,874 వద్ద కొనసాగుతోంది. అలాగే నిఫ్టీ 518 పాయింట్లు ఎగబాకి 11,223 వద్ద ట్రేడవుతోంది.గత పదేళ్లలో ఒకే రోజు నిఫ్టీ ఈమేర లాభపడడం ఇదే తొలిసారి.