రివ్యూ : గద్దలకొండ గణేష్ 

చిత్రం : గద్దలకొండ గణేష్ (2019)

నటీనటులు : వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ, మృణాళినీ తదితరులు

సంగీతం : మిక్కీ జె మేయర్

దర్శకత్వం : హరీష్ శంకర్

నిర్మాత : రామ్‌ ఆచంట, గోపి ఆచంట

రిలీజ్ డేటు : 20సెప్టెంబర్, 2019.

మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్. అంతకంటే ఎక్కువగా ఆయనకి మెగా ఫ్యాన్స్ పల్స్ తెలుసు. మెగా హీరోలని ఎలా చూపిస్తే అభిమానులకి నచ్చుతుందో హరీష్ కి తెలిసినంత మరెవ్వరికీ తెలియదేమో ! అందుకే ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ ది క్లాస్ టచ్. ఫిదా, తొలిప్రేమ లాంటి క్లాస్ సినిమాలతో విజయాలు అందుకొన్నాడు. విభిన్న ధృవాలైన హరీష్ శంకర్, వరుణ్ తేజ్ లు ‘గద్దలకొండ గణేష్’ (వాల్మీకి) కోసం కలిశారు. వరుణ్ ని ఊరమాస్ గా మార్చేశాడు. మరీ.. అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది. గద్దగకొండ గణేష్ ఎలా ఉన్నాడు ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ !

కథ :
అభి (అథర్వా) మంచి దర్శకుడు అనిపించుకోవాలని తాపత్రయపడుతుంటాడు. ఇందుకోసం ఓ రియలిస్టిక్ సినిమాని తెరకెక్కించేలానే ప్లాన్ లో ఉంటాడు. ఇందుకోసం ప్రస్తుతం ఫామ్ లో ఉన్న గ్యాంగ్ స్టర్ కోసం వెతుకుంతుంటాడు. ఆ సమయంలో అతనికి గద్దలకొండ గణేష్ (వరుణ్‌ తేజ్‌) గురించి తెలుస్తుంది. అతనిపైనే సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. ఐతే, తనకి ఎదురు తిరిగిన వారిని, తన గురించి ఆరా తీసిన వారిని గణేష్ చంపుతుంటాడు. మరీ.. గద్దలకొండ గణేష్ కి అభి ఎలా దగ్గరయ్యాడు ? ఆయన జీవితకథని సినిమాగా తెరకెక్కించేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ? ఈ జర్నీలో గణేష్ లో వచ్చిన మార్పులు ఏంటీ ?? అనేది కథ.

ప్లస్ పాయింట్స్ :

* కథ-కథనం

* వరుణ్ తేజ్ నటన

* సంగీతం

* ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్

మైనస్ పాయింట్స్ :

* పెద్దగా లేవనే చెప్పాలి

ఎవరెలా చేశారంటే ? 

దర్శకుడు హరీష్ శంకర్ ని రిమేక్ స్పెషలిస్ట్ అంటుంటారు. అలాగని ఆయన వరుసగా రిమేక్ సినిమాలేమీ చేయలేదు. దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా అద్భుతంగా మలిచాడు. మాతృక కంటే బాగా తీశాడు అనిపించుకొన్నాడు. బహుశా.. అందుకే ఆయనపై రిమేక్ స్పెషలిస్టు అనే ముద్రపడిపోయిందేమో.. ! తమిళ హిట్ ‘జిగర్తాండ’ని ‘గద్దలకొండ గణేష్’గా అద్భుతంగా మలిచాడు. కథలో పెద్దగా మార్పులు చేయకున్నా.. బాబీ సిన్హా నటించిన పాత్రలో చేసిన మార్పులు ఆకట్టుకొన్నాయి. వరుణ్ తేజ్ పాత్రని ఇంకా బలంగా మలిచాడు. అవి మాస్ ని ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఇక గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ ఒదిగిపోయాడు.

‘జై లవ కుశ’ సినిమాలో ఎన్టీఆర్ ‘జై’ పాత్రలో కనిపించిన రేంజ్ లో గద్దలకొండ గణేష్ పాత్ర ఉంది. నటుడుగా వరుణ్ ని ఓ మెట్టు ఎక్కించిన పాత్ర ఇదని చెప్పవచ్చు. వన్ మేన్ షో చేశాడు. ఇకపై వరుణ్ మాస్, ఊరమాస్ పాత్రలని దైర్యంగా చేయొచ్చు. తమిళ నటుడు అధర్వ తన పాత్రకి చక్కగా సరిపోయాడు. డైరెక్టర్ కావాలనే కసిని బాగా చూపించాడు. శ్రీదేవిగా పూజా  హెగ్డే ఆకట్టుకొంది. దేవత సినిమా లోని సాంగ్ థియేటర్స్ లో కొత్త అనుభూతినిచ్చింది. మృతణాళీని నటన బాగుంది. తనికెళ్ల భరణి కనిపించేది కొద్దిసేపైనా ఏడిపించేలా నటించారు. నితిన్ గెస్ట్ రోల్ లో మెరిశాడు. అది అభిమానులకి కిక్కునిస్తుంది.  మిగితానటీనటులు తమ తమ పరిధి మేరకు నటీంచారు.

సాంకేతికంగా : 

మిక్కీ జే మేయర్ అదించిన పాటలు బాగున్నాయి. ఇక నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేలా ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ కోసం మిక్కీ అందించిన నేపథ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా.. గద్దలకొండ గణేష్ టెక్నికల్ గా బాగున్నాడు.

చివరగా : గద్దలకొండ గణేష్.. గత్తర లేపిండుపో !

రేటింగ్ : 3.5/5

నోట్ : ఇది సమీక్షకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.