కొత్త దర్శకులకి హరీష్.. ఓ సలహా !
రాత్రికి రాత్రే టైటిల్ మారిపోయిన సినిమా ‘గద్దలకొండ గణేష్’. ‘వాల్మీకి’గా తెరకెక్కి ‘గద్దలకొండ గణేష్’గా విడుదలైన సంగతి తెలిసిందే. టైటిల్ మార్పు విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ భాగోధ్వేగానికి గురయ్యారు. తన జీవితంలో తొలిసారి బాధపడుతున్నట్టు చెప్పారు. హరీష్ బాధని అర్థం చేసుకొన్న ఇతర దర్శకులు ఆయనకి ధైర్యం చెప్పారు. ఐతే, రిలీజ్ కి ముందు ఏడిపించిన సినిమానే.. రిలీజ్ తర్వాత హరీష్ ని నవ్వించేసింది. గద్దలకొండ గణేష్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. సక్సెస్ మీట్ లో హరీష్ స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన కొత్త దర్శకులకి విలువైన సలహా ఒకటి ఇచ్చారు. ‘మా సినిమాలోని ఓ సన్నివేశంలో కోరుకున్న హీరోతో సినిమా చేయలేకపోయినందుకు దర్శకుడు సినిమా నుంచి తప్పుకొంటాడు. ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీలో కూడా కనిపిస్తుంటాయి. ఈ సన్నివేశాన్ని ఉదాహరణగా తీసుకుని ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక్కోసారి మనకు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూసి వదిలేసుకుంటూ ఉంటాం. ఆ అవకాశాలు మళ్లీ రాకపోవచ్చు. కాబట్టి చిన్న అవకాశమా పెద్ద అవకాశమా అని చూడకుండా వచ్చినదాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిపోవాలి. మనకు నచ్చిన పనిని వేరే పని కోసం వదులకుంటే దాన్ని కాంప్రమైజింగ్ అంటారు. అదే చిన్న మార్పులు చేసుకుని ఆ పనిని పూర్తి చేయగలిగితే దానిని అడ్జస్టింగ్ అంటారు’ అన్నారు.