మెట్రో వేడుకలకు మంత్రి హరీష్ అందుకే దూరంగా ఉన్నారా..?
దేశంలోనే అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్టును మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లో ప్రారంభించారు. పండుగ వాతావరణంలో వేడకలు జరిగాయి. అయితే ఈ వేడుకలకు మంత్రి హరీష్ మాత్రం హాజరుకాకపోడంపై అంతా చర్చ జరుగుతోంది.. హైదరాబాద్ లో అంతపెద్ద ఈవెంట్ జరుగుతోంటే మంత్రి హరీష్ దూరంగా ఉండటమేంటి… ఆయన్ను కావాలనే వేడుకకు దూరంగా ఉంచారా అనే ప్రశ్న అందరినీ వేధిస్తోందట. దీని వెనక కారణమేమై ఉంటుంది అని ఆరాలు తీస్తున్నారు.
మంత్రి హరీష్ రావు లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ పర్యటనలో సిఎం కేసిఆర్, ఆయన తనయుడు, ఐటిశాఖ మంత్రి కేటిఆర్ అన్నీ తామై ముందుండి నడిపించారు. మెట్రో రైలులో ప్రయాణించే సమయంలో మంత్రి కేటిఆర్ మోడీ పక్కనే కూర్చుని అన్ని విషయాలను ప్రధానికి వివరించారు. తెలంగాణ మంత్రివర్గం, అధికార వర్గాలు, ప్రముఖులంతా ఉన్నారు కానీ హరీష్ రావు మాత్రం రాకపోవడానికి బలమైన కారణాలేవో ఉన్నాయన్న చర్చ జరుగుతోంది..
కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు వచ్చిన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారని సంబంధిత శాఖ వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సిడబ్ల్యుసీ అనుమతులపై ఉన్నతాధికారులతో భేటి అయ్యేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని, అందుకే ఆయన మెట్రో ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయారని చెబతున్నారు. అయితే ప్రధాని వచ్చే విషయం ముందుగానే తెలిసినా ఆ భేటీని వాయిదా వేసుకోకపోవడంలో ఏదో దాగుందని అనుకుంటున్నారు అంతా. ఢిల్లీ భేటీ ఒక కారణంగా చూపుతున్నారని అనుకుంటున్నారు.