‘ఈనాడు’ కథనంపై సీఎంవో సీరియస్ !
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ సోమవారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రులిద్దరు సుదీర్ఘంగా చర్చించారు. వీటిలో గోదావరి జలాలని కృష్ణాకి తరలించడం ప్రధానమైనది. తద్వారా రాయలసీమ జిల్లాలు, మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాకి నీరు అందించాలన్నది ప్రధాన లక్ష్యం. దాంతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారమ్. ఐతే, ముఖ్యమంత్రుల బేటీ విషయంలో.. సీఎంలు ఇద్దరు కేంద్రంపై అంసతృప్తిని వ్యక్తం చేసినట్టు హైలైట్ చేస్తూ ఈనాడు దినపత్రిక కథనం రాసింది. దీనిపై సీఎవో ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో ఏ మాత్రం నిజంలేదని తెలిపింది. ఊహాజనిత కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హెచ్చరించింది.
ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు సీఎంలు గత నాలుగు నెలలుగా సమావేశమయ్యారని, సమావేశానికి రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు సంబంధం లేదని సీఎంవో పేర్కొంది. పోలీసు అధికారుల విభజన, తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీస్ కానిస్టేబుళ్లకు ఏపీలో కూడా శిక్షణ ఇచ్చే అంశంపైనా సీఎంలు జగన్, కేసీఆర్ చర్చించినట్లు సీఎంవో తెలిపింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చలు జరిగినట్లు చెప్పింది. నిన్నటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మినహా మరే ఇతర విషయాలూ చోటు చేసుకోలేదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. మరీ.. దీనిపై ఈనాడు దినపత్రిక ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది చూడాలి.