ట్రంప్ నోట మళ్లీ అదే మాట !


కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తానని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనికి భారత్ గట్టిగా సమాధానం ఇచ్చింది.  కశ్మీర్ అంశం పూర్తిగా అంతర్గత అంశమని.. దీంట్లో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని పేర్కొంది. ఆ తర్వాత ట్రంప్ కూడా కశ్మీర్ అంశం భారత్ అంతర్గత విషయమని అంగీకరించాడు కూడా. ఐతే, ట్రంప్ మరోసారి కశ్మీర్ విషయంలో మధ్యవర్థిత్వం వహిస్తానని ప్రకటించారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో ట్రంప్‌ సోమవారం సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా.. భారత్‌, పాక్‌లు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ అంశం చాలా సంక్లిష్టమైందని, ఈ అంశంలో మధ్యవర్తిత్వం చేయగల సమర్థత తనకుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇప్పటికే ఈ విషయంపై భారత్‌ వైఖరిని స్పష్టం చేశామని తెలిపింది. అయితే దీనిపై మరింత స్పష్టత కోసం బుధవారం జరిగే సమావేశం వరకు వేచి చూడాలని కోరింది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ట్రంప్‌తో ప్రధాని మోదీ బుధవారం భేటీ కానున్న విషయం తెలిసిందే.